సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు
*16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*
*17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .*
*18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*
*19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*
☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘
‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’
సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వాళ్లే పూజారులు. బయ్యక్కపేట గుడి ఇప్పటికీ ఉంది. గద్దెలు మేడారంలో ఉన్నాయి. సమ్మక్క జాతరకు చిలుకల గట్టు నుండి గద్దెకు వస్తుంది. రెండు రోజులుండి మళ్లీ చిలుకల గట్టుకు వెళ్లిపోతుంది.
☘సారలమ్మ ఎవరు ?☘
కోయ కుల పురాణంలో 4 వ గోత్రానికి ఇలవేల్పు సమ్మక్క. మేడారానికి 4 కి.మీ. దూరంలో కన్నెపల్లి గ్రామంలో ఉండేది. 4 వ గోత్రానికి చెందిన ‘కాక’ అనే ఇంటిపేరు గల వారు సమ్మక్కకు పూజారులు. కన్నెపల్లిలో సారాలమ్మ గుడి ఉంది.
☘సారలమ్మ ఎలా స్థిరపడింది ?☘
సారలమ్మ బస్తర్‌లో కాటమయ్య ఇంట్లో పుట్టింది. నిరుపేద కుటుంబం. సారలమ్మ పుట్టగానే అదృష్టం కలిసి వచ్చి అతను ధనవంతుడై పోయాడు. ఒకరోజు ‘కూర ఏమీ లేదని’ కాటమయ్య బాధపడుతుంటే సారలమ్మ పులి అవతారమెత్తి దుప్పిని చంపుతుంది. కాటమయ్యతో ‘నువ్వు అడవికి వెళ్లి , ఫలాని దగ్గర ఓ దుప్పిని పులి చంపింది. పోయి ఆ దుప్పిమాంసం తెచ్చుకో’ అంటుంది. కాటమయ్య దుప్పిని తెచ్చుకొని కోసి తొందర తొందరగా స్నానం చేసి రక్తం పూర్తిగా పోకుండానే సారలమ్మకు మొక్కుతాడు. దీంతో సారలమ్మకు కోపం వచ్చి , అహంకారం పెరిగి *‘రక్తం పోకుండానే స్నానం చేసి నన్ను మొక్కుతావా ? నేనుండను. వెళ్లి పోతాను’* అని పోరుపెడుతుంది. దాంతో సారలమ్మను కాటమయ్య బస్తర్ నుండి ఖమ్మం జిల్లా తాళ్లపల్లి అనే గ్రామ పొలిమేరల్లో వదిలి పెడతాడు. సారలమ్మను చూసిన ఓ గొర్లకాపరి *‘ఈమె ఎవ్వరో దేవత’* అనుకుని , ఆమె జన్మ వృత్తాంతం శివశక్తి ద్వారా తెలుసుకొంటాడు.. సారలమ్మ కోరిక మేరకు ఆమెను గంగ (గోదావరి) దాటించి ఏటూరు నాగారం మండలం ‘దొడ్ల’ అనే గ్రామంలో వదిలిపెడతాడు. ‘దొడ్ల’ గ్రామంలో కోయ తెగవారు కొన్ని రోజులు ఏలుకొని , సారలమ్మ కోరిక మేరకు ఆమెను కన్నెపల్లి గ్రామంలో వదిలి పెడతారు. అందుకే కన్నెపల్లిలో 4 వ గోత్రానికి చెందిన ‘కాక’ ఇంటి పేరుగల వారు సారలమ్మకు పూజారులు. ఆనాటి నుండి నేటి వరకు పూజాధికాలు వారే చేస్తున్నారు. ఆ ఊర్లో సారలమ్మ గుడి ఉంది. గద్దె మాత్రం మేడారంలో ఉంటుంది. జాతర సమయంలో సమ్మక్క కంటే ఒకరోజు ముందు సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. సమ్మక్క పోయిన తర్వాత సారలమ్మను కన్నెపల్లికి తీసుకెళ్తారు .
ఓరుగల్లు రాజధానిగా క్రీ.శ.1083 నుండి క్రీ.శ.1323 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరువూదుడు పరిపాలించాడు. ఆ సమయంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పాలిస్తున్నాడు. ఆయన భార్య సమ్మక్క. వారికి సారలమ్మ , నాగులమ్మ అనే కుమార్తెలు , జంపన్న అనే కుమారుడు ఉన్నాడు. ఆ రోజులోనే కాకతీయ సామ్రాజ్యంలో తీవ్రమైణ కరువు ఏర్పడిందట. కప్పం కట్టవలసిందిగా ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజును ఆజ్ఞాపించాడు. అయితే దానికి పగిడిద్దరాజు నిరాకరించడంతో ఆయన మీద యుద్ధం ప్రకటించాడు ప్రతాపరుద్రుడు. అది గమనించిన పగిడిద్దరాజు కుమార్తె నాగులమ్మ , అల్లుడు గోవిందరాజు , కుమారుడు జంపన్నలతో కలిసి కాకతీయ సైన్యంపై తిరుగుబాటు చేస్తారు. సంపెంగ వాగు దగ్గర జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన జంపన్న వీరమరణం పొందుతాడు. దీంతో ఆయన రక్తంతో వాగు ఎర్రబారుతుంది. అలా ఎర్రబారిన వాగును నేడు జంపన్న వాగుగా పిలిస్తారు. కాకతీయుల వంశ రాజులను ఎదిరించి సమ్మక్క , సారక్క పగిడిద్దరాజులతో పాటు వారి కుటుంబమంతా వీరమరణం పొందింది. అలా మరణించిన గిరిజన వీరులను నేడు గిరిజనులు దేవతలుగా పూజిస్తున్నారు.
తెలంగాణలో జరిగే ఈ జాతర రెండు ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతియేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభిచారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణె లను తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర , ఒరిస్సా రాష్ట్రాలనుండి కూడా అధిక సంఖ్యలో భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
జాతర మొదటిరోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవరోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) వైవేద్యంగా సమర్పించుకుంటారు.
☘స్థల పురాణం☘
మేడారం గ్రామంలో సమ్మక్క , సారలమ్మలకు ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు. గద్దెలు నిర్మించి , వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని *‘సమ్మక్క , సారలమ్మల గద్దెలు’* అంటారు. ఆ గద్దెలకు సంబంధించిన స్థల పురాణం ఒకటి ప్రచారంలో ఉంది. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మేడారం ప్రాంతాన్ని సామంతుడిగా పగిడిద్ద రాజు పాలించేవాడు. అతను ప్రతి యేటా ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షం పడక కరువు వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గిరిజనులు పన్ను చెల్లించనందున పగిడిద్ద రాజు ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించలేకపోతాడు. ప్రతాపరుద్రుడు అపార్థం చేసుకొని , కప్పం కట్టకుండా , తానే స్వయంగా రాజుగా ప్రకటించుకున్నాడని , యుగంధరునితో పాటు సైన్యాన్ని పగిడిద్ద రాజు పైకి దండయాత్రకు పంపిస్తాడు. పగిడిద్ద రాజు ఆ సైన్యంతో యుద్ధం చేసి మరణిస్తాడు. భర్త మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధానికి వచ్చి తానూ మరణిస్తుంది. ఆ తర్వాత సారలమ్మ , జంపన్న , గోవిందరాజులు కూడా యుద్ధంలో మరణిస్తారు.
ఈ ప్రాంతంలోని గిరిజనులు తమ కోసం యుగంధర మంత్రితో యుద్ధం చేసి మరణించడం వల్ల సమ్మక్క - సారలమ్మలు మరణించిన చోట గద్దెలు నిర్మించి , వారి ప్రతినిధులుగా కొయ్యలు పాతి దేవరగా భావించి జాతర నిర్వహిస్తారు. వీర వనితలుగా భావించి తెలంగాణలో సమ్మక్క - సారలమ్మలను ప్రతి కార్యక్రమాల్లో , సమావేశాల్లో గుర్తు చేసుకోవడం , స్ఫూర్తిగా తీసుకోవడం వారి గద్దెలకు మొక్కి , దేవతల స్వరూపాలుగా భావించడం ప్రారంభించారు.
*సమ్మక్క - సారలమ్మ దేవతలకు జాతరను నిర్వహించే గిరిజనులు ఎవరు ? ఆ పూజారులు ఎవరు ? హక్కుదారులు ఎవరు ? సమ్మక్క సారలమ్మలకు గిరిజనులకు సంబంధం ఏమిటి ? ఎందుకు సమ్మక్క - సారలమ్మ జాతర చేస్తున్నారు ? అనే అంశాలు తెలుసుకోదగ్గవి.*
సమ్మక్క - సారలమ్మ జాతరను నిర్వహించేది కోయతెగకు చెందిన గిరిజనులు. అయితే , కోయ తెగలో 12 రకాల వారున్నారు. వారు రాచకోయ , గంపకోయ , గొత్తికోయ , పూసకోయ , గొట్టెకోయ , చెంచుకోయ , పారటాకుల కోయ , గీతకోయ , భాషకోయ , కొండకోయ , వెదురుకోయ , అమ్ముల కోయ , ఈ కోయల్లో వరంగల్ జిల్లాలో రాచకోయ వారున్నారు. ఈ తెగకు చెందిన కోయలే మేడారం సమ్మక్క - సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. వీరే దీనికి హక్కుదారులు , పూజారులు. పూజారులను కోయలు వడ్డెలు అని కూడా అంటారు. కాగా , కోయ తెగలో గోత్రాలుంటాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత ఇలవేల్పుగా ఉంటుంది.
ఆ గోత్రాలు ఇవి:
3 వ గోత్రికం. 4 వ గోత్రికం. 5 వ గోత్రికం. 6 వ గోత్రికం. 7 వ గోత్రికం.
సమ్మక్క 3 వ గోత్రికం, 5 వ గోత్రికం వారికి ఇలవేల్పు.
ఇక సమ్మక్కకు పూజారులు అంటే వడ్డెలు ఎవరంటే సిద్ధబోయిన , కక్కెర అనే ఇంటిపేరు గల వాళ్లు.
సారలమ్మ 4 వ గోత్రికం వారికి ఇలవేల్పు. కేవలం ‘కాక’ అనే ఇంటి పేరు గల వాళ్లు సారలమ్మకు వడ్డెలు.
పగిడిద్ద రాజు 4 వ గోత్రికం వారికి ఇలవేల్పు. ‘పెనక’ అనే ఇంటిపేరు గలవాళ్లు పగిడిద్ద రాజుకు వడ్డెలు.
గోవిందరాజులు 6 వ గోత్రికం వారికి ఇలవేల్పు. ‘దబ్బగట్ల’ అనే ఇంటిపేరు గల వాళ్లు గోవిందరాజుకు పూజారులుగా వ్యవహరిస్తారు.
మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు కోయ గిరిజన తెగకు చెందిన రాచకోయ వారు హక్కుదారులుగా ఉన్నారు. ముందే చెప్పినట్టు కోయ సంప్రదాయం ప్రకారం కేవలం ఆయా గోత్రాలకు సంబంధించిన వాళ్లు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు.
గిరిజన తెగలో 12 రకాల కోయలున్నట్లే ప్రతి కోయ తెగకు 3,4,5,6,7 గోత్రాలు ఉన్నాయి. కోయ రకాలను బట్టి , గోత్రాలను బట్టి ఆశ్రీత హక్కుదారులు ఉన్నారు. ఉదాహరణకు రాచకోయ 3 వ గోత్రానికి చెందిన ఆశ్రీతదారులు డోలి , పట్టడి అని రెండు రకాలున్నారు. అన్ని రకాల కోయలకు , అన్ని రకాల గోత్రాలను బట్టి డోలి , పట్టడి ఆశ్రీత హక్కు దారులున్నారు. డోలి , డోలు వాయిస్తూ కోయ కుల పురాణం చెబితే , పట్టడి పడగలు (దేవతల) పటం చూపెడుతూ కోయ కుల పురాణం చెబుతారు. ఇందులో కోయకులం ఎక్కడ పుట్టింది ? ఎలా పెరిగింది ? దేవతలు ఎవరు ? సమ్మక్క , సారలమ్మల జన్మ వృత్తాంతం , కోయ గోత్రాలు - ఇవన్నీ కోయల కులపురాణంలో సంప్రదాయాలు , ఆచారాలతో సహా అన్నీ ఇమిడి ఉంటాయి.
☘కోయ కుల పురాణం☘
డోలి , పట్టడి వారి కుల పురాణం ప్రకారం ఆసాసరావు , నూలిముత్తికి నాగులమ్మ , సడలమ్మ , సారలమ్మ, సీడలమ్మ , పుట్టలమ్మ అనే ఐదుగురు ఆడ సంతానం. ‘సడలమ్మ’నే సమ్మక్క అంటారు. ఆసాసరావు. దూలిముత్తి సమ్మక్కకు పెండ్లి చెయ్యాలని పగిడిద్ద రాజును చూస్తారు. పగిడిద్ద రాజును సమ్మక్క చూస్తే సొల్లు కార్చుతూ , కుష్టువ్యాధి కలిగి, ముసలివాడిలా దుర్వాసనతో ఉంటాడు. అతణ్ని చూసి సమ్మక్క మెచ్చదు. సమ్మక్క మెచ్చనందువల్ల తల్లిదంవూడులు పగిడిద్దరాజుకు నాగులమ్మనిచ్చి పెండ్లి చేయడానికి నిర్ణయిస్తారు. పెండ్లి కోసం పోలు మీదికి పగిడిద్ద రాజు వచ్చి కూర్చున్నాడు. నాగులమ్మను పెండ్లికూతురును చేసి , ఆమెను తీసుకుని సమ్మక్క పోలు మీదికి వచ్చి పగిడిద్ద రాజును చూస్తుంది. తను చూసినపుడు అంధ వికారం కలిగి కుష్టువ్యాధితో , సొల్లు కారుతూ , ముసలి వాడిలా ఉన్నవాడు పెండ్లి పీటల మీద కూర్చునేటప్పటికి ‘‘నొసట ఛిత్ర కన్ను , అరికాళ్ల దేవర పద్మం , పల్లె పరుసా మాను, వీపున వింజామర , మహాసుందరంగా... అబ్బా ..! *సూర్యుడా , నువ్వు పొడవకు నేనే పొడుస్తానని భరభర మండుకుంటూ వచ్చినట్టు’’* కన్పిస్తాడు. పగిడిద్ద రాజును చూసిన సమ్మక్క ‘ఇంత అందగాడా....’ అని ఆశ్చర్యపోయి , మనసుపడి , నాగులమ్మను కూర్చుండబెట్టి , పగిడిద్ద రాజు , నాగులమ్మల మధ్య పోలులో తానూ వచ్చి కూర్చుంటుంది. పగిడిద్ద రాజు నాగులమ్మపై తలవాలు , బియ్యం పోస్తే అవి సమ్మక్కపై పడతాయి. ఇది చూసిన కులపెద్ద (తల్పతి) ఇది సరికాదని సమ్మక్కను పోలునుండి బయటికి పంపిస్తారు. సమ్మక్క అక్కడి నుండి అటే వెళ్లి పోతుంది. పెండ్లి చేసుకోదు. కానీ , పగిడిద్ద రాజుతో పెండ్లి జరిగినట్లే ఆమె భావిస్తుంది. దైవమై దేశాలకు వెళ్లి పోతుంది.
*‘‘సమ్మక్క మా ఇలవేల్పు. అవతార పురుషురాలు. దశావతారాలు ఎత్తింది. ఆదిశక్తి , ముత్యాలమ్మ , మైసమ్మ , భూలక్షి , మహాలక్ష్మి , పార్వతి , లచ్చిమీదేవి ఇలా అన్ని అవతారాలూ దాల్చింది. ఇది పెండ్లికి సంబంధించిన అంశం. కానీ , ఆదిశక్తి లోకం పుట్టనుండి పెరగనుందని వేల్పుకొండకు (వేల్పు=దేవతలు) వేల్పులను తెస్తుంది. ఆ తెచ్చిన దేవతల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత. అందులో 3 , 5 గోత్రాలకు సమ్మక్క , 4 వ గోత్రానికి సారలమ్మ, పగిడిద్ద రాజు , 6 వ గోత్రానికి గోవిందరాజులు , 7వ గోత్రానికి సూర సండయ్యలు ఇలవేల్పులు.’’* - ఇదంతా కోయల పురాణంలో ఉంది. సమ్మక్క , సారలమ్మలను ఇలవేల్పుగా కొలిచేవాళ్లు ఈ గోత్రానికి చెందినవాళ్లే. నాటి నుండి నేటి దాకా వీరే సమ్మక్క హక్కుదారులు.
☘కోయ పురాణంలో పగిడిద్ద రాజు☘
కోయ పురాణంలో పగిడిద్ద రాజు కోయ 4వ గోత్రానికి ఇలవేల్పు. ప్రస్తుతం కూడా వాళ్లే పూజారులు. పగిడిద్ద రాజు దశావతారాలు ఎత్తిండు. అవతార పురుషుడు , కృతయుగంలో కార్తీకరాజు , ద్వాపరయుగంలో ఆదిరాజు , కలియుగంలో భూంగరాజు. భూంగరాజు కుమారులే కోయలు. కోయలు 12 రకాలు. అందులో పెద్దవాడు రాచకోయ. ఈ రాచకోయే వరంగల్ జిల్లాలోని కోయలని ముందే అనుకున్నాం. ప్రస్తుతం కొత్తగూడ మండలం పూనుగుండ్ల గ్రామంలో అటు సమ్మక్క దశావతారాలు ఎలా ఎత్తిందో ఇటు పగిడిద్ద రాజు ఎత్తినట్లు కోయల కుల పురాణ కథాంశం.
Comments
Post a Comment